పాలకొండ వెబ్ న్యూస్ , నవంబర్ 28: పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పౌర సేవలు అందించేందుకు శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) నిమ్మక జయక్రిష్ణ పాల్గొన్నారు. సమావేశంలో పట్టణంలో తాగునీటి సరఫరా, రహదారుల దుస్థితి, డ్రైనేజీ, స్ట్రీట్ లైటింగ్, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ఆయన విపులంగా సమీక్షిస్తూ అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షాకాలంలో ఏర్పడే నీటి నిల్వలు, కాలుష్య సమస్యలు, బలహీనంగా ఉన్న కాలువలు, చెత్త తొలగింపులోపాలు వంటి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించి, నిర్దిష్ట గడువులోపల సమస్యలు పరిష్కారం దిశగా కనబడేలా చర్యల ప్రణాళికను సమర్పించాలని ఎమ్మెల్యే జయక్రిష్ణ ఆదేశించారు. పట్టణ అభివృద్ధి ప్రణాళికలో పాదచారుల మార్గాలు, అంతర్గత రహదారుల మరమ్మతులు, కాలువల విస్తరణ, కాలుష్య నియంత్రణ చర్యలను ప్రాధాన్యత క్రమంలోకి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజా సౌకర్యాల మెరుగుదలతోపాటు పేదవర్గాలు, బలహీన వర్గాలు నివసించే కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు సమకూర్చడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కూడా ఆయన ఆదేశించారు. పట్టణ అభివృద్ధిపై రాజీ లేకుండా, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా పనిచేయడం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు
0 Comments