పాలకొండ వెబ్ న్యూస్ అక్టోబర్ 8:రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి, చిన్నారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. పాలకొండ మండలంతో పాటు సీతంపట మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అంగన్వాడీ కేంద్రాలు, విద్యార్థి వసతి గృహాలు, రేషన్ షాపులు స్వయంగా సందర్శించి ఆహార నాణ్యత, సరఫరా విధానాలను పరిశీలించారు.
చిన్నారులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని, నెలకు 30 గుడ్లు, ఆరు లీటర్ల పాలు అందించాల్సిన విధానాన్ని ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పాలకొండలోని ఇందిరానగర్ కాలనీలో గిరిజన ఆశ్రమ పాఠశాలను మంగళవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించిన ఆయన, అక్కడ విద్యార్థులతో మాట్లాడారు.
విద్యార్థులు “పాలు, గుడ్లు సరిగ్గా ఇవ్వడం లేదు” అని చెప్పడంతో చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వార్డెన్, హెచ్.ఎం.లపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “ఇలాంటి నిర్లక్ష్యం మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఆరోగ్య పరిస్థితి, ఆహార నాణ్యత పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “ప్రభుత్వం అందిస్తున్న పథకాలు చిన్నారుల శారీరక వికాసం కోసం — వాటిని నిర్లక్ష్యం చేయడం పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది” అని అన్నారు.
0 Comments