పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను జిల్లా చేయాలి — లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలి: పాలకొండ సాధన సమితి డిమాండ్.

పాలకొండ వెబ్ న్యూస్ :పాలకొండలో జిల్లాల పునర్విభజనలో పాలన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచి పాత రెవెన్యూ డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలని పాలకొండ సాధన సమితి డిమాండ్ చేసింది.
ఈ డిమాండ్‌ కోసం రాజకీయాలకు అతీతంగా పౌరులు, వర్తక, వ్యాపార, ఉద్యోగ, ఉపాధ్యాయ, మేధావ వర్గాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పాలకొండ ఇన్‌ఛార్జి పడాల భూదేవి మాట్లాడుతూ — “పాలకొండ ప్రజల హృదయ స్పందనకు ప్రతిబింబం ఈ ఉద్యమం. కూటమి ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి” అని తెలిపారు. ఆమె మాట్లాడుతూ, “ఆనాడు అస్తవ్యస్తంగా జరిగిన జిల్లాల విభజనలో పాలకొండ రెవెన్యూ డివిజన్‌ విభజన ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జరిగింది. గిరిజన ప్రాంతాల హక్కులు, ఐటిడిఏ స్థిరత్వం వంటి అంశాలు ఇప్పుడు మళ్లీ ప్రశ్నార్థకంగా మారాయి. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాను. త్వరలో ఇన్‌ఛార్జి మంత్రి అచ్చం నాయుడు దృష్టికీ తీసుకెళ్తాను” అని తెలిపారు.
సాధన సమితి అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ — “శాసనసభ, లోక్‌సభ స్థానాలు పెరగనున్న నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అవసరం తప్పనిసరి. పాలకొండ పాత రెవెన్యూ డివిజన్‌కు జిల్లా స్థాయి అర్హతలు అన్ని ఉన్నాయి. గతంలో పాలకులు చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలి. పాలన సౌలభ్యం, భౌగోళిక పరిస్థితులు, సాంఘిక సంబంధాలను దృష్టిలో ఉంచి పాలకొండకు న్యాయం చేయాలని” విజ్ఞప్తి చేశారు.
సాధన సమితి గౌరవాధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు మాట్లాడుతూ — “అమరావతిని రాష్ట్ర కేంద్రంగా ఎంచుకున్న విధంగానే పాలకొండ కూడా ఈ ప్రాంతానికి పాలనా కేంద్రంగా అనుకూలంగా ఉంటుంది. అన్ని మండలాలకు సమాన దూరంలో ఉండే పాలకొండను జిల్లా చేయడం ద్వారా ప్రజలకు సౌకర్యం లభిస్తుంది” అన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన జేఏసీ నాయకులు సవర సింహాచలం, సుగన్న, పట్టణ పెద్దలు నందాన సుధాకర్, వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు వెలమల మన్మధరావు (కౌన్సిలర్), నగర్ పంచాయతీ కౌన్సిలర్లు తుమ్మగుంట శంకర్రావు, కడగల వెంకటరమణ, బాసూరు కాంతారావు, బాబి కిలారి మోహన్, రుంకు రామకృష్ణ, వెన్నపు వెంకటరమణ, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వల్లూరు సత్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు జొన్నలగడ్డ కామేశ్వరరావు, బాసూరు శివశంకర్ ప్రసాద్, ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకుడు బుజ్జి, ఆర్ఎంపీ డాక్టర్స్ యూనియన్ నాయకుడు పాలవలస రామినాయుడు, మెడికల్ షాప్స్ అసోసియేషన్ తరఫున కొట్టిస రాజశేఖర్, రెల్లి కులస్తుల సంఘం నాయకుడు కొట్నాన అప్పన్న, విద్యా సంస్థల సంఘం నాయకుడు దూబ వెంకటరమణ, రియల్ ఎస్టేట్ సంఘం నాయకుడు పల్లి లక్ష్మణ్ నాయుడు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు వావిలపల్లి గోవిందరావు, వాక్ మీట్ సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు దుప్పాడ గణేష్, మెడికల్ షాపు యజమానుల సంఘం నాయకులు, శ్రీ కోట దుర్గమ్మవారి ఆలయ మాజీ అధ్యక్షుడు శాసపు సర్వారా, కమిటీ సభ్యుడు అక్కల నాయుడు, రైతు సంఘం విజయనగరం అధ్యక్షుడు నారు జనార్దన్ రావు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ద్వారపూడి అప్పలనాయుడు, బీసీ నాయుడు, ఎందవ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
🚨 పాలకొండలో జిల్లా సాధన సమితి ర్యాలీ: పటిష్ట బందోబస్తు
పాలకొండ వెబ్ న్యూస్: జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ మరియు నిరసన కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుతంగా ముగిశాయి.ముందు జాగ్రత్తగా పోలీస్‌వారు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ బందోబస్తును పాలకొండ డీఎస్పీ ఎం. రాంబాబు, సీఐ ఏ. ప్రసాద్ రావు, ఎస్ఐ ప్రయోగమూర్తి పర్యవేక్షించారు.




Post a Comment

0 Comments