పాలకొండ వెబ్ న్యూస్ :బాలికలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అల్లరి చేస్తున్న యువకులను చూసి, పది మందికీ విద్యాబుద్ధులు నేర్పించే ఒక ఉపాధ్యాయుడు ఊరుకోలేకపోయారు. అదే అతను చేసిన తప్పు అన్నట్లుగా ఆకతాయిలు విరుచుకుపడ్డారు. పట్టణంలోని కోమటిపేట కూడలిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో, సక్రమంగా ఉండమని చెప్పినందుకు ఆ యువకులు ఏకంగా ఆయనపైనే దాడి చేయడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. స్థానికులు కలగజేసుకోవడంతో యువకులు అక్కడి నుండి పరారయ్యారు. కొందరు వ్యక్తులు ఈ ఘటనను చరవాణిలో చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇది వైరల్గా మారింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పట్టణ పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ మరియు పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆదేశాల మేరకు శక్తి టీం రోజు పలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి విద్యార్థిని విద్యార్థులకు నైతిక విలువలు, పెద్దలపట్ల, ఉపాధ్యాయులపట్ల గౌరవభావంతో యువత మెలగాలని చెబుతున్నారు. అయినప్పటికీ ఇటువంటి సంఘటన పాలకొండలో జరగడంపై విద్యావేత్తలు, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పు జరిగినప్పుడు అడిగిన పెద్దలపై పిల్లలు ఇలా చేయి చేసుకోవడం సమాజానికి అత్యంత తప్పుడు సంకేతం వెళుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. గురువులను, పెద్దలను గౌరవించడం, సక్రమంగా మెలగడం యువతరం యొక్క నైతిక బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించి, ప్రశ్నించినందుకు దాడి చేయడం మన సామాజిక విలువల పతనానికి నిదర్శనమని చెప్పకతప్పదు. యువతలో మంచి సంస్కారాన్ని పెంపొందించే విషయంలో ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు, పౌరుడు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. News by : BSS Prasad.
0 Comments