పాలకొండ వెబ్ న్యూస్: మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి (తెదేపా) కంచుకోటగా ఉన్న పాలకొండ నియోజకవర్గంలో పార్టీ నాయకుల మధ్య నెలకొన్న వర్గ విభేదాలపై అధిష్టానం దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా, తెదేపా శ్రేణుల్లో వర్గపోరు తగ్గకపోవడం పార్టీ పురోగతికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు.
భామిని పర్యటనకు విచ్చేసిన మంత్రి లోకేశ్, ఈ గురువారం రాత్రి పాలకొండ నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించ నున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ముఖ్యంగా వర్గ విభేదాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై లోతుగా సమీక్షించనున్నారు.
గతంలో వర్గపోరు కారణంగానే తెదేపా ఇక్కడ మూడుసార్లు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇటీవల కూటమి హయాంలో జనసేన పార్టీ ఇక్కడ జెండా ఎగురవేసింది. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే, పార్టీ పట్టును పెంచుకోవాల్సిన ఆవశ్యకతపై లోకేశ్ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. సిట్టింగ్ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తో సమన్వయం చేసుకుంటూ, స్థానిక ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, మంత్రి లోకేశ్ నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సమావేశం తమలో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని, వర్గ విబేధాలు తొలగిపోతాయని పార్టీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ సమావేశం ద్వారా పాలకొండ తెదేపాలో ఐక్యత ఏర్పడుతుందో లేదో చూడాలి.
0 Comments