వివేకానందుని మార్గం యువతకు ఆదర్శం: ఋషి యోగా కేంద్రంలో ఘనంగా జయంతి వేడుకలు

పాలకొండ, జనవరి 12 (పాలకొండ వెబ్ న్యూస్ - బి.ఎస్.ఎస్. ప్రసాద్): పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఋషి యోగా కేంద్రంలో సోమవారం స్వామి వివేకానంద జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ధనుంజయ్ గురూజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా సాధకులు స్వామీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్ బొడ్డు రామ్మోహన్ ప్రసంగిస్తూ, భారతీయ సనాతన ధర్మాన్ని, మన దేశం యొక్క సత్సాంప్రదాయాన్ని ప్రపంచ నలుమూలలకూ విస్తరింపజేసిన మహనీయుడు స్వామి వివేకానందుడని కొనియాడారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ వివేకానందుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం సోంబాబు మాట్లాడుతూ, భారతీయ యోగా విద్యను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత స్వామీజీకే దక్కుతుందని గుర్తుచేశారు. శారీరక ఆరోగ్యం కంటే మానసిక దృఢత్వం ముఖ్యమని, అది నిత్యం యోగా మరియు ధ్యానం చేయడం వల్లనే సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని, దీని ద్వారా ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాధకులందరూ కలిసి చేసిన సామూహిక ధ్యానం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నెల్లి వెంకటరమణ, రామారావు గురూజీ మరియు ఇతర యోగా సాధకులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

Post a Comment

0 Comments