ప్రజలకు ప్రభుత్వ శాఖలు అందించే అన్ని రకాల సేవలు ఇకపై తప్పనిసరిగా ఆన్‌లైన్ వేదికగా మరియు 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే అందాలని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖల కార్యదర్శి కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలను ఎలాంటి అవకతవకలు లేదా అంతరాయం లేకుండా ప్రజల ముంగిటకే చేర్చాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని, దానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇప్పటికీ కొన్ని శాఖలు మాన్యువల్ పద్ధతిలోనే సేవలు అందిస్తున్నాయని గుర్తు చేసిన ఆయన, ఇకపై అన్ని శాఖలు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ మరియు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సేవలు అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు ఈ కొత్త విధానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. ఇప్పటికే వివిధ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ పూర్తయిందని, దీని ద్వారా ఆయా శాఖలకు మరింత ఉపయోగపడేలా ప్రత్యేక యూస్ కేసెస్ సిద్ధం చేస్తున్నామని భాస్కర్ తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకతను పెంచి, ప్రజలకు వేగంగా సేవలు అందించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.
న్యూస్ బై: బి.ఎస్.ఎస్. ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్.
0 Comments