యువత మేలుకో.. మత్తును వీడు: మాదకద్రవ్యాలపై శక్తి టీం సమరభేరి


పాలకొండ వెబ్ న్యూస్ , జనవరి 10: నేటి యువత వ్యసనాల వైపు మళ్లీ తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని పాలకొండ సబ్ డివిజన్ శక్తి టీం ఏఎస్ఐ ఝాన్సీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై స్థానిక యువతకు ఆమె సవివరంగా అవగాహన కల్పించారు. సమాజంలో క్యాన్సర్లా వ్యాపిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆమె కోరారు.
ముఖ్యంగా విద్యార్థులు, యువకులు క్షణికావేశంలో చేసే తప్పులు వారి జీవితాంతం తీరని వ్యధను మిగిలిస్తాయని, మాదకద్రవ్యాలకు బానిసైతే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు సామాజిక గౌరవం కూడా దెబ్బతింటుందని హెచ్చరించారు. శక్తి టీం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి యువతతో ముఖాముఖి మాట్లాడారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్‌లను ప్రతి ఒక్కరితో డౌన్లోడ్ చేయించారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐ ఝాన్సీ మాట్లాడుతూ, యువత తమ శక్తిని నిర్మాణాత్మక పనులకు, దేశాభివృద్ధికి ఉపయోగించాలని ఆకాంక్షించారు. అనుమానిత వ్యక్తుల సంచారం ఉన్నా లేదా ఎవరైనా మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడుతున్నా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శక్తి టీం చేపట్టిన ఈ చైతన్య కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన లభించింది. యువత పెడదారి పట్టకుండా ఉండాలంటే ఇలాంటి అవగాహన సదస్సులు ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.

Post a Comment

0 Comments