జనసేన అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ.. నేడే తుది నిర్ణయం!

పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్ పీఠం కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించిన నేపథ్యంలో, అభ్యర్థి ఎంపికపై శనివారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
       కూటమి పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కడంతో శుక్రవారం ఉదయం నుంచి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో విస్తృత చర్చలు జరిగాయి. కూటమి ఐక్యతను చాటుతూ, అందరి అభిప్రాయాలను తీసుకుంటూ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ సాగుతోంది.
పరిశీలనలో ముగ్గురు పేర్లు
     టీడీపీ సీనియర్ నాయకుడు పల్లా కొండలరావు సతీమణి విజయనిర్మల, టీడీపీ అధికార ప్రతినిధి గంట సంతోష్ కుమార్ తల్లి వరలక్ష్మి, జనసేన నాయకులు అరుణ్ సతీమణి సరోజనమ్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురికీ శుక్రవారం రాత్రి జనసేన పార్టీ నుంచి ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. వీరిలో ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది
టీడీపీ నాయకులు సైతం కూటమి ధర్మానికి కట్టుబడి, జనసేన అభ్యర్థి విజయానికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉండటం కూటమి బలాన్ని ప్రతిబింబిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
      అభ్యర్థి పేరును నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండటంతో, పాలకొండ రాజకీయ వర్గాల్లో అందరి దృష్టి ఈ నిర్ణయంపైనే నిలిచింది.

Post a Comment

0 Comments