దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

పాలకొండ వెబ్ న్యూస్ - 26-09-2026​పాలకొండలోని కోటదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో శనివారం ఉదయం 11:00 గంటలకు పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

​ఉత్సవాల నిర్వహణకు పల్లా కొండలరావు ఆధ్వర్యంలో త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో వి.వి. సూర్యనారాయణను ఎమ్మెల్యే ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. పోలీసు, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు గతం కంటే మెరుగ్గా సేవలందించాలని, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నగర పంచాయతీ కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు, ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

​పాలకొండ డిఎస్పి ఎం. రాంబాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు పోలీసుశాఖ పూర్తి సహకారం అందిస్తుందని, ఉత్సవాలు పూర్తయ్యే వరకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతామన్నారు. టిడిపి సీనియర్ నాయకుడు పల్లా కొండలరావు మాట్లాడుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటామని, తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో పడాల భూదేవి, గంటా సంతోష్ కుమార్, కర్నేన అప్పలనాయుడు, కొండదాడి రాజేష్, గుమ్మడి సింహాద్రి మాట్లాడారు. సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాదశర్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసశర్మతో పాటు కూటమి నాయకులు గర్భాన సత్తిబాబు, కొరికాన గంగునాయుడు, బొమ్మాలి సుధాకర్, దేవస్థాన కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments