పాలకొండ వెబ్ న్యూస్, సెప్టెంబర్ 20
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం ఆమోదించిన 8 గంటల పని దినాన్ని 13 గంటలుగా పెంచే నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా ఖండించింది. శనివారం పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించబడింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ –
“కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక–ఉద్యోగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయి. వాటిలో భాగంగానే 8 గంటల పని దినాన్ని 13 గంటలుగా పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కార్మికులపై మోపిన అన్యాయం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
1920లోనే మహాత్మా గాంధీతో పాటు కార్మిక సంఘాలు ‘ఎనిమిది గంటల పని దినం’ నినాదాన్ని ఇచ్చాయని, స్వాతంత్ర్యం అనంతరం 1948 పారిశ్రామిక చట్టంతో ఇది దేశంలో అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. అలాంటి చారిత్రాత్మక హక్కును తుంగలో తొక్కడం హేయకరమని విమర్శించారు.
“కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయిన ప్రభుత్వాల విధానాలకు ఇదే నిదర్శనం. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం” అని హెచ్చరించారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అర్థమూడి లక్ష్మణరావు, కాద రాము, పెద్దగాడ రమణ, ఏ.ఈశ్వరరావు, ఏ.ధనంజయరావు, ఎస్.గంగరాజు, ఎస్.బాలరాజు, ఏ.రవికుమార్, ఎల్.కామేష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments