పాలకొండ వెబ్ న్యూస్.. 21.10.2025
పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ కోటదురమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు అమ్మవారి దసరా మహోత్సవాలు జరగనున్నాయి.
దర్శనాలకు ప్రత్యేక మార్గాలు
భక్తులకు నిజరూప దర్శనం సులభంగా అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తూర్పు ప్రధాన గోపురం వైపు నుంచి భక్తులను ఆలయానికి అనుమతిస్తారు. ఉచిత, ప్రత్యేక, శీఘ్ర దర్శనం, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. ప్రముఖులకు దక్షిణ ప్రధాన గోపురం ద్వారా దర్శనం కల్పించనున్నారు. ఘటోత్సవాల కోసం ప్రత్యేక మార్గం సిద్ధం చేస్తున్నారు.
దసరా మహోత్సవాల షెడ్యూల్
22న బాలా త్రిపురసుందరి
23న గాయత్రీ దేవి
24న అన్నపూర్ణా దేవి
25న కాత్యాయని దేవి
26న మహాలక్ష్మి
27న లలితా త్రిపురసుందరి
28న మహా చండీ దేవి
29న సరస్వతి దేవి
30న దుర్గాదేవి
అక్టోబరు 2న రాజరాజేశ్వరి అలంకారంతో దర్శనం, తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
మొదటి రోజు ముహూర్త పూజలు బేరీ కుటుంబ సభ్యులతో నిర్వహించి, అనంతరం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం
గతంలో ప్రధాన రహదారిపై వేదిక నిర్మాణం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తగా, ఈసారి ఆలయం ఎదుట పశువైద్యశాల పక్కన విశాల ప్రాంగణంలో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో భక్తులు, ప్రేక్షకులకు ఎటువంటి అంతరాయం ఉండదు.
పక్కా ప్రణాళిక
ఉత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తూర్పు ద్వారం వైపు మరో మార్గాన్ని సిద్ధం చేశారు. మూడు వరుసలుగా భక్తులను అనుమతించేలా ప్రణాళిక రూపొందించారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి వీవీ సూర్యనారాయణ మాట్లాడుతూ – “దసరా ఉత్సవాలను భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం” అన్నారు.
......... బి. శివశంకర్ ప్రసాద్.
0 Comments