పాలకొండను జిల్లాగా ప్రకటించాలి: ఉద్యమానికి సంఘీభావం!

 కళాభారతి న్యూస్ (పాలకొండ వెబ్ న్యూస్)
పాలకొండ: పాలకొండను పాత రెవెన్యూ డివిజన్ కేంద్రంగా జిల్లాగా ప్రకటించాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలని కోరుతూ చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభించింది. గురువారం పట్టణంలోని శ్రీ అయ్యప్ప శంకర్ ఫంక్షన్ హాల్లో పాలకొండ జిల్లా సాధన సమితి జిల్లా అధ్యక్షుడు బుడితి అప్పలనాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల మద్దతు:
సమావేశానికి హాజరైన ప్రముఖులు, నాయకులు పాలకొండ జిల్లా సాధన సమితి చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నెల 31వ తేదీన కోటదుర్గమ్మ ఆలయ సమీపంలో జరగనున్న నిరాహారదీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ దీక్షల్లో రాజకీయ, ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని బుడితి అప్పలనాయుడు కోరారు.
టీడీపీ సీనియర్ నేత మద్దతు:
పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు పల్లా కొండలరావును కలిసి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కొండలరావు, ఈ పోరాటానికి తనవంతు సహకారం అందిస్తానని, నగర పంచాయతీలో జిల్లా అంశంపై తీర్మానం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాలకొండ జిల్లా సాధన కోసం చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Post a Comment

0 Comments