వాకింగ్ గ్రూప్: ఆరోగ్యం, సేవకు మారుపేరు – పాలకొండ డిగ్రీ కాలేజీ మైదానం స్ఫూర్తి!


పాలకొండ వెబ్ న్యూస్:

ఆరోగ్యకరమైన జీవనశైలి, నిస్వార్థ సేవకు మారుపేరుగా పాలకొండ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లోని 'వాకింగ్ గ్రూప్' నిలుస్తోంది. గత దశాబ్ద కాలంగా ప్రతి రోజు ఉదయం ఇక్కడ నడక ప్రారంభించిన ఈ బృందం, కేవలం వ్యాయామానికే పరిమితం కాకుండా, పలు సామాజిక సేవా కార్యక్రమాలతో స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది.
కుటుంబ ప్రోత్సాహం, ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం:
నడకను ప్రారంభించిన ఈ గ్రూప్ సభ్యులు, తమ కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని కూడా ఈ గ్రౌండ్‌కి తీసుకువస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణను తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నారు. ఒకరి కష్ట సుఖాల్లో పాలుపంచుకోవడం, ఏడాదికోసారి వన భోజనాలు ఏర్పాటు చేయడం వంటి వాటితో ఈ గ్రూప్ సభ్యుల మధ్య బంధం మరింత బలపడింది. అంతేకాక, సభ్యులకు పదోన్నతులు వంటి సందర్భాల్లో సన్మానాలు చేయడం, విందుల్లో పాల్గొనడం వంటివి ఆనవాయితీగా కొనసాగుతున్నాయి.
సామాజిక సేవలో అగ్రగామి:
ఈ వాకింగ్ గ్రూప్ పలు సామాజిక సేవలను కూడా చేపట్టింది. అందులో ముఖ్యంగా:
 * గ్రౌండ్ అభివృద్ధి: డిగ్రీ కాలేజీలోని "నడక దారిని మెరుగు పర్చడం" కోసం మరియు నడక దారి పక్కన "సోలార్ లైట్లు" ఏర్పాటు చేయడం కోసం నిధులు సేకరించి, స్థానిక వాకర్స్‌కి సదుపాయాలు కల్పించారు.
 * పర్యావరణ పరిరక్షణ: స్థానిక కళాశాల ప్రిన్సిపాల్‌తో కలిసి వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు.
 * యోగ, సన్మానాలు: ప్రియతమ ప్రధాని పిలుపు మేరకు గ్రౌండ్‌లోనే 'యోగాంధ్ర' కార్యక్రమం చేపట్టి పలువురు "సామాజిక వేత్తలకు సన్మానాలు" చేసి ఆదర్శంగా నిలిచారు.
 * దేవాలయ సేవ: ప్రతి సంవత్సరం శ్రీ కోట దుర్గమ్మ తల్లి పుట్టినరోజున ఆలయ ప్రాంగణంలో ప్రసాదం పంపిణీ చేసి, దేవస్థానం అధికారులు, భక్తుల ప్రశంసలు పొందారు.
టూర్స్, ఆదర్శప్రాయమైన బంధాలు:
అప్పుడప్పుడు దైవ దర్శనాలకు, మానసిక ఉల్లాసం కోసం టూర్స్ ఏర్పాటు చేసి పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ, ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. ఈ ఆదర్శప్రాయమైన బంధానికి నిదర్శనంగా ప్రతి ఆదివారం వాకింగ్ మిత్రులందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగి పలువురి "మెప్పు" పొందడం కొసమెరుపు.
నడతతో పాటు నడవడిక:
తమ దైనందిన "నడకతో పాటు నడత కూడా మెరుగు పర్చుకోవడం" కోసం నిత్యం చర్చించడం, వాటిని పాటించడం వీరి విధిగా పెట్టుకున్నారు. పాలకొండ డిగ్రీ కాలేజీ వాకింగ్ గ్రూప్ ఆరోగ్యం, స్ఫూర్తి, సామాజిక సేవ, వ్యక్తిత్వ వికాసానికి దర్పణంగా నిలుస్తూ, ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. News by: BSS Prasad.


Post a Comment

0 Comments