పాలకొండలో సత్యసాయి వ్రతాలు

 పాలకొండ వెబ్ న్యూస్, అక్టోబర్ 17 (శుక్రవారం): పాలకొండ నీలమ్మ కాలనీలోని వారణాసి కుమారస్వామి  నివాసంలో శ్రీ సత్యసాయి వ్రతాలు, భజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. అనంతరం పాలకొండ సత్యసాయి సేవా సమితి సభ్యులు ఎన్వీ రమణ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కలియుగంలో సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ కొరవడి, మానవులంతా ఈర్ష్య, ద్వేషం, అసూయ, అహంకారాలతో నిండిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భక్తి మార్గంలో నడవాలని, ముఖ్యంగా సత్యానికి కట్టుబడి ఉండాలని ఉద్బోధించారు. 

 "సత్యమేవ జయతే, సత్యం నాస్తి పరో ధర్మ" అని ఉదహరిస్తూ, సత్యానికి మించిన ధర్మం మరొకటి లేదని, సత్యాన్ని పాటిస్తే భగవంతుడు మనతోనే ఉంటాడని రమణ స్పష్టం చేశారు.

భక్తులలో ఉండవలసిన ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం అనే ఆరు గుణాలు (షడ్గుణాలు) ఎవరిలో ప్రకాశిస్తాయో, ఆ వ్యక్తుల యందు భగవంతుడు కొలువై ఉంటాడని సత్యసాయి బాబా చెప్పిన ఆధ్యాత్మిక సందేశాన్ని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయి తత్వాన్ని ఆలకించారు.

అక్టోబర్ పండుగలు: హిందూ సంస్కృతిలో జ్యోతి, ధనం, ప్రగతి!

 

Post a Comment

0 Comments