మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజనం కార్మిక సంఘం, ప్రభుత్వ పాఠశాల శానిటేషన్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) నేతలు డిమాండ్ చేశారు. నిర్వాహకులకు కనీస వేతనాలు చెల్లించాలని, అలాగే ప్రభుత్వ పాఠశాల శానిటేషన్ కార్మికులకు గుర్తింపు కార్డులు, పనిముట్లు ఇవ్వాలని వారు పట్టుబట్టారు. సీతంపేట మండల సీఐటీయూ కార్యాలయంలో మధ్యాహ్న భోజనం కార్మిక సంఘం మరియు పాఠశాల శానిటేషన్ కార్మికుల సమావేశం జరిగింది. అనంతరం కరపత్ర ఆవిష్కరణ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
సామూహిక వంటశాలల పేరుతో ఉపాధికి గండి:
ప్రభుత్వం ప్రతి మండలంలోనూ స్మార్ట్ కిచెన్ల పేరుతో సామూహిక వంటశాలలు (కేంద్రీకృత వంట విధానం) నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా ప్రయత్నాలు చేయడం అన్యాయమని రమణారావు విమర్శించారు. ఈ విధానం వలన వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతారని, ముఖ్యంగా తొమ్మిదేళ్లుగా ఎలాంటి కనీస జీతం లేకుండా, అప్పులు చేసి, తాళిబొట్లు తనఖా పెట్టి వేడివేడి భోజనాన్ని అందించిన మహిళల పొట్ట కొట్టడం దారుణమని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రీకృత వంట విధానం అమలు చేస్తే వాహనాల ద్వారా పంపిణీ ఆలస్యమై, విద్యార్థులకు భోజనం సరిగా అందకుండా పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. లక్షల రూపాయలు ముందస్తు పెట్టుబడి పెట్టి సేవా దృక్పథంతో పథకం నిర్వహిస్తున్న నిర్వాహకులకు నష్టం కలిగించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళా కార్మికులకు ద్రోహం:
మహిళలను ఉద్ధరిస్తామన్న ప్రభుత్వ పెద్దలు, ఉన్న ఉపాధిని కూడా తీసేయడం అత్యంత నీచమైన చర్యగా రమణారావు అభివర్ణించారు. ప్రైవేటు సంస్థలకు పథకాన్ని అప్పగించి, వారి నుంచి లక్షల్లో కమీషన్లు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
ఈ ప్రైవేటీకరణ విధానాన్ని మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం, సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, దీనిపై జిల్లా వ్యాప్తంగా నిర్వాహకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఏకం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం మండల నాయకులు మరియు ప్రభుత్వ పాఠశాల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎన్. రోయి భారీ, వి. చామంతి, బి. గౌరమ్మ, టి. అంజలి, బి. నవోమి, ఏ. కావ్య, ఎస్. సంతోషి, వి. ప్రశాంతి, బి. రోజామణి, ఎం. అంజలి, ఎస్. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
0 Comments