పాలకొండ వెబ్ న్యూస్ :
ఈ ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం తగినంత ఎరువులు సరఫరా చేసినప్పటికీ, వాటి పంపిణీలో లోపాలు స్పష్టంగా కనబడ్డాయి. రైతులు ఎండనక, వాననక రైతు భరోసా కేంద్రాలు (RBKలు), ఎరువుల డీలర్ల షాపుల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది.
నిరాశే మిగిలింది: 10 ఎకరాలు, లేదా 1/2 ఎకరం ఉన్నప్పటికీ, చాలా మంది రైతులకు కేవలం ఒక బస్తా యూరియాతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.
నల్లబజారు దారి: దీంతో ఒకట్రెండు ఎకరాలు ఉన్న చిన్న రైతులకు కొంత ఉపశమనం లభించినా, ఆపై భూమి ఉన్న రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నల్ల బజారులో అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
⛈️ 'మొంథా' తుఫాను నష్టం - నామమాత్రపు పరామర్శలు
ఎన్నో కష్టాలు పడి రైతులు పంటను చేతికి తెచ్చుకునే సమయంలో 'మొంథా' తుఫాను తీవ్రంగా నష్టం కలిగించింది. పంటలు నేలకొరిగి, వరి ధాన్యం వెన్నులకు మొలకలు వచ్చాయి.
"పంట చేతికొచ్చిన సమయంలో తుఫాను తీవ్రంగా నష్టపరిచింది. మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించడానికి రాజకీయ నాయకులు, వ్యవసాయ సిబ్బంది తూతూ మంత్రంగా వ్యవహరించారు. వారికి అనుకూలమైన మండలాలు, గ్రామాల్లోనే తిరిగి ఫోటోలు తీసుకున్నారు తప్ప, రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు," అని ఖండాపు ప్రసాదరావు గారు ఆవేదన వ్యక్తం చేశారు.
💰 కూలీల డిమాండ్ - పెరగని మద్దతు ధర
పంట నష్టం ఒకవైపు, చేను కోతకు కూలీల అధిక డిమాండ్ మరోవైపు అన్నదాతను కుంగదీస్తోంది.
కోత కూలీల భారం: గతంలో ఎకరాకు ₹2,000 ఉన్న వరి కోత కూలీ నేడు నేలకొరిగిన పంట కారణంగా ఏకంగా ₹5,500 వరకు డిమాండ్ చేస్తున్నారు.
మద్దతు ధర: అప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మాత్రం నామమాత్రంగా పెరిగింది.
గతంలో వరి మాగాణుల్లో కట్టేజనుము, పెసలు సబ్సిడీపై సరఫరా చేసేవారు. అయితే, ప్రస్తుతం పంట నష్టం జరిగి, చేను మొలకతెత్తు సమయంలో వేసుకుందామంటే రైతు భరోసా కేంద్రాలు, గ్రామ వ్యవసాయ సహాయకులు మిన్నకుండిపోయారు.
ప్రస్తుత పరిస్థితులను గ్రహించి పాలకులు తక్షణమే రైతులను ఆదుకోవడానికి సమగ్ర చర్యలు తీసుకోవాలని, లేదంటే రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని ఖండాపు ప్రసాదరావు గారు ప్రభుత్వాన్ని కోరారు.

0 Comments