పాలకొండ పట్టణంలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కొంతమంది అక్రమ కట్టడాలు చేపట్టి కబ్జా చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై పత్రికలలో వస్తున్న వార్తలు స్థానిక అధికారులుకు గానీ, ప్రజాప్రతినిధులుకు గానీ కనిపించడం లేదా అని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడు సూటిగా ప్రశ్నించారు. ఆదివారం స్థానిక డీసీఎంఎస్ స్థలంలో కబ్జాలకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్న అంశాన్ని అప్పలనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి ద్వారపూడి అప్పలనాయుడు, ఆర్.టి. ఐ. యాక్టవిస్ట్ దుంపల రమేష్ బాబు ఆయన వెంట ఉన్నారు. అనంతరం, పట్టణ నడిబొడ్డున కోట్ల రూపాయలు విలువచేసే ప్రతిపాదిత రైతు బజార్ స్థలాన్ని కూడా నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ... నాగవంశపు వీధిలోని పీతల బంధ, అలాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఉన్న 30 సెంట్ల స్థలాన్ని కొంతమంది అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్న ఈ వ్యవహారంలో విశ్రాంత తహసీల్దారుల పేరుతో ఫేక్ పట్టాలు సృష్టించి అమ్ముకుంటున్న వైనంపై ప్రజలు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ అక్రమ కట్టడాలు, కబ్జాలపై భారత కమ్యూనిస్టు పార్టీ తరపున స్థానిక తహసిల్దార్, నగర పంచాయితీ కమిషనర్, గౌరవ సబ్ కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ వారికి లేఖ ఇస్తామని అప్పలనాయుడు తెలిపారు. పట్టణ ప్రజల అవసరాల దృష్ట్యా ప్రతిపాదిత రైతు బజార్‌ను కచ్చితంగా కట్టి తీరాలని, పట్టణంలో ఉన్న అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరియు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణను ఆనుకుని కబ్జా గురవుతున్న 30 సెంట్ల స్థలాన్ని అమ్మాయిల హాస్టల్ కోసం కేటాయించాలని కోరుతూ సీపీఐ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కబ్జా స్థలాల పరిశీలనలో సీపీఐ మండల కార్యదర్శి ద్వారపూడి అప్పలనాయుడుతో పాటు వండాన మోహన్, దుంపల రమేష్ బాబు (చిన్ని) తదితరులు పాల్గొన్నారు.
0 Comments