పాలకొండ ప్రజల ఆకాంక్ష: జిల్లాగా ప్రకటించాలి లేదా శ్రీకాకుళంలో కలపాలి!

పాలకొండ వెబ్ న్యూస్ : (రెవెన్యూ డివిజన్ కేంద్రం):
పాలకొండ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నెలకొంది. కలెక్టర్ స్థాయి కేంద్రంగా ఉన్నప్పటికీ, జిల్లా స్థాయి సదుపాయాల లోపం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం పాలకొండ ప్రజలను కలవరపెడుతున్న ప్రధాన అంశం — “పాలకొండను జిల్లా చేస్తారా? లేక పూర్వపు శ్రీకాకుళం జిల్లాలో కలుపుతారా?” అన్నది.
జిల్లాల పునర్విభజన సమయంలో పాలకొండను పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొంది. గతంలో శ్రీకాకుళంతో ఉన్న అనుబంధం తెగిపోవడం వల్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు కలెక్టర్ కార్యాలయం చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టడం, ఎక్స్‌ప్రెస్ బస్సులు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భామిని, సీతంపేట మండలాల ప్రజలకు పరిపాలనా వ్యవహారాలు క్లిష్టంగా మారాయి.

ఈ నేపథ్యంలో పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. వేదికపైకి వచ్చిన ప్రజాప్రతినిధులు, మేధావులు, సంఘనాయకులు “పాలకొండను జిల్లా చేయాలి; లేకపోతే శ్రీకాకుళంలో కలపాలి” అని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనని వారు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ సమస్య రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి చేరింది. పాలకొండ జిల్లా సాధన సమితి తమ డిమాండ్లను అధికారికంగా సమర్పించింది. ప్రభుత్వం ప్రజాభిప్రాయం, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

పాలకొండ ప్రజల ముక్తకంఠ డిమాండ్ స్పష్టంగా ఉంది — “పాలకొండను జిల్లా చేయాలి, లేకపోతే మళ్లీ శ్రీకాకుళంలో కలపాలి.” ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌పై ఎలా స్పందిస్తుందో అన్నదే ఆసక్తిగా మారింది.
 జొన్నలగడ్డ కామేశ్వరరావు సీనియర్ జర్నలిస్టు

Post a Comment

0 Comments