చిలుకల ద్వాదశి పూజలు ఘనం!

పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండలో కార్తీక శోభ.. తులసీ-దాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా పాలకొండ పట్టణంలోని నక్కల పేటలో వెలసిన శ్రీశ్రీశ్రీ లలితా మహా త్రిపుర సుందరీ సమేత అమృత మృత్యుంజయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి చిలుకల ద్వాదశి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి.కార్తీక మాసంలో వచ్చే ఈ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో తులసీదాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామివారి పూజలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించు కుంది. వేదమంత్రాల మధ్య కార్యక్రమం: ప్రధాన అర్చకులు శరత్ బాబు ఆధ్వర్యంలో అర్చకులు అనంత్, ఆకాష్ తదితరులు వేదమంత్రాలు పఠిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ప్రాంగణం దేదీప్యమానం: చిలుకల ద్వాదశి సందర్భంగా చెరుకుగడతో ఆవుపాలను చిలికే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణం మొత్తం దీపారాధనతో దేదీప్యమానంగా వెలిగింది. భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ పూజలను ఆలయ ధర్మకర్త పల్లా కొండబాబు పర్యవేక్షణలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పట్టణంలోని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Post a Comment

0 Comments