పాలకొండకు చెందిన విద్యార్థి జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. నగర పంచాయతీ పరిధిలోని కస్పా వీధికి చెందిన యామల అభిషేక్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఆయన ' కథనం వారపత్రిక సంపాదకులు యామల ఈశ్వరరావు కుమారుడు. చిత్తూరు జిల్లా పలమనేరులో సెప్టెంబర్ 2న వాలీబాల్ స్టేట్ మీట్ జరిగింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. గత నెల 31వ తేదీ నుంచి ఈ పోటీలు జరిగాయి. అండర్-19 వాలీబాల్ టోర్నీమెంట్లో అభిషేక్ సత్తా చాటాడు. దీంతో, మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అతడు ఎంపికయ్యాడు. గతంలో డాక్టర్ సి.ఎల్.నాయుడు స్కూల్, పెద్దకాపు వీధి జడ్పీ హైస్కూల్‌లో చదివేటప్పుడే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించాడు.ప్రస్తుతం అభిషేక్ కుమార్ విశాఖపట్నం సాయి వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అక్కడ ఏవీఎన్ జూనియర్ కాలేజీలో చదువుతూ, వారి తరఫున టోర్నమెంట్లలో పాల్గొని ఈ అవకాశం దక్కించుకున్నాడు. జాతీయ పోటీలకు ఎంపికైన, గోల్డ్ మెడల్ సాధించిన అభిషేక్‌ను పాలకొండ వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు. వారిలో వడమ పుష్ప నాధం, ఎస్.వెంకట రమణ, రాములు, పద్మరాజు తదితరులు ఉన్నారు. క్రీడాభిమానులు, పట్టణ ప్రముఖులు కూడా అభిషేక్‌ను ప్రశంసించారు.
0 Comments