పాలకొండ వెబ్ న్యూస్: వడమ/పాలకొండ: విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సమూహంతో పనిచేసే తత్వం, సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. శ్యాంబాబు తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వడమ, ఇందిరానగర్ కాలనీల్లో బుధవారం ప్రత్యేక సేవా శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ప్రిన్సిపాల్ ఎం. శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు సుంకరి సుధాకర్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సామాజిక బాధ్యత మెరుగుపడుతుందని, విద్యార్థులందరూ చిత్తశుద్ధితో శిబిరంలో పాల్గొనాలని కోరారు. ప్రారంభ సమావేశం అనంతరం విద్యార్థులు వడమ గ్రామం, ఇందిరానగర్ కాలనీలో ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీయూపీ స్కూల్ హెచ్ఎం జి. విజయ్ కిరణ్, ఉపాధ్యాయురాలు విమలకుమారి, ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్, టు ప్రోగ్రాం ఆఫీసర్లు బి. జయమణి, బి. రాజు, ఇతర అధ్యాపక సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.
0 Comments