సంక్రాంతి వేళ ప్రయాణికులకు షాక్: 12 నుంచి అద్దె బస్సుల సమ్మె!

పాలకొండ వెబ్ న్యూస్ :స్త్రీశక్తి పథకంతో పెరిగిన భారమే కారణం రాష్ట్రంలో రవాణా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులను నిలిపివేసి సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారికంగా సమ్మె నోటీసు అందజేయనున్నారు. ప్రధానంగా 'స్త్రీశక్తి' పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల నిర్వహణ వ్యయం భారీగా పెరిగిందని, ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గత ఏడాది ఆగస్టు 15 నుంచి అమలవుతున్న ఉచిత ప్రయాణ పథకం కారణంగా బస్సులపై ఒత్తిడి పెరిగిందని, తద్వారా టైర్లు, స్పేర్ పార్ట్స్ వంటి నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బస్సుకు నెలకు కనీసం 15 వేల నుండి 20 వేల రూపాయల వరకు అదనపు భత్యం చెల్లించాలని వారు గత కొంతకాలంగా అధికారులను కోరుతున్నారు. అయితే, ఇటీవల జరిగిన చర్చల్లో భాగంగా యాజమాన్యం కేవలం 5,200 రూపాయలు మాత్రమే పెంచుతూ సర్క్యులర్ జారీ చేయడం పట్ల సంఘం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్పష్టత లేని నిర్ణయాల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ సమ్మె ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,419 అద్దె బస్సులపై పడనుంది. వీటిలో పల్లె వెలుగు నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్ వరకు అన్ని రకాల సర్వీసులు ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేళ లక్షలాది మంది ప్రజలు తమ సొంత ఊర్లకు ప్రయాణించే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే పండుగ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

Post a Comment

0 Comments