రేగిడి ఆమదాలవలస: మండలంలోని సంకిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజాం శాసనసభ్యులు శ్రీ కొండ్రు మురళీమోహన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కొండ్రు మురళీమోహన్ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం వక్తృత్వ పోటీలు ఘనంగా నిర్వహించారు. "ఆత్మవిశ్వాసం ఉన్న విద్యార్థిని విద్యార్థులు దేనినైనా సాధించగలరు" అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు తమ గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి బట్న సత్యవతమ్మ మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్య సాధనలో ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, ఇందిరా గాంధీ వంటి గొప్ప నాయకుల జీవిత గాథలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినప్పుడే విజయం వరిస్తుందని ఆమె పేర్కొన్నారు.
అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆరో తరగతి విద్యార్థిని తమటాల ప్రైసి ప్రథమ బహుమతి సాధించగా, తొమ్మిదో తరగతికి చెందిన బైరి జితేంద్ర ద్వితీయ, అధికారుల రాంచరణ్ తృతీయ బహుమతులు అందుకున్నారు. ఏడో తరగతి విద్యార్థిని షేర్ చాంద్ బీబీకి కన్సిలేషన్ బహుమతి లభించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రామినాయుడు మరియు ఉపాధ్యాయ సిబ్బంది పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు శనపతి ప్రమీల, బట్న రవి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
0 Comments