పార్వతీపురం, జనవరి 9 (పాలకొండ వెబ్ న్యూస్): తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వేడుకలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అంబరాన్నంటాయి. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన 'సంక్రాంతి సంబరాలు' అత్యంత వైభవంగా జరిగాయి. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా ముస్తాబు చేసిన కలెక్టరేట్ ప్రాంగణం పండుగ శోభతో కళకళలాడింది. ఈ వేడుకల్లో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మరియు ఐటిడిఎ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు.ముందుగా సంప్రదాయబద్ధంగా గోమాతకు పూజలు నిర్వహించిన మంత్రి మరియు ప్రజాప్రతినిధులు, అనంతరం భోగి మంటలు వేసి పండుగను ఘనంగా ప్రారంభించారు. మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన సాంప్రదాయ క్రీడలు, గిరిజన కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల పండుగ అయిన సంక్రాంతి మన మూలాలను గుర్తు చేస్తుందని, ప్రజలందరి జీవితాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలతో మమేకమై పండుగ జరుపుకోవడంతో కలెక్టరేట్ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.
0 Comments