జేఈఈ మెయిన్స్‌లో పాలకొండ విద్యార్థుల ప్రభంజనం

పాలకొండ వెబ్ న్యూస్ : జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ‘జేఈఈ మెయిన్స్-2026’ ఫలితాల్లో పాలకొండ ప్రాంత విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. కఠోర శ్రమ, పట్టుదలతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించి జిల్లా పేరును మారుమోగించారు.

​టాప్ స్కోరర్లు వీరే..

  • ​కొత్తకోట లలితా ఆదిత్య (99.94 పర్సంటైల్): పాలకొండలోని నవోదయ నగర్‌కు చెందిన లలితా ఆదిత్య 99.94 పర్సంటైల్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. తండ్రి రమేష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా, తల్లి లావణ్య గృహిణి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, క్రమశిక్షణతో కూడిన చదువే తన విజయానికి కారణమని ఆదిత్య పేర్కొన్నాడు.
  • ​భాసూరు మణిధీరజ్ (99.867 పర్సంటైల్): పాలకొండ వడ్డాది వారి వీధికి చెందిన భాసూరు ప్రసాద్ (స్వామి) కుమారుడు మణిధీరజ్ 99.867 పర్సంటైల్‌తో సత్తా చాటాడు. అత్యుత్తమ స్కోరు సాధించిన మణిధీరజ్‌ను స్థానికులు, బంధుమిత్రులు అభినందనలతో ముంచెత్తారు.
  • ​గుమ్మడి మణికంఠ (99.071 పర్సంటైల్): పట్టణంలోని గారమ్మ కాలనీకి చెందిన గుమ్మడి మణికంఠ 99.071 పర్సంటైల్ సాధించాడు. వెన్నలవలస జవహర్ నవోదయలో పదో తరగతి వరకు చదివిన మణికంఠ, విశాఖపట్నంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి జనార్దన వ్యాపారస్తుడు కాగా, తల్లి సింధుకుమారి గృహిణి. కుమారుడి విజయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
  • ​కోట రణధీర్ నాయుడు (99.036 పర్సంటైల్): పాలకొండ మండలం మల్లివీడు గ్రామానికి చెందిన రణధీర్ నాయుడు 99.036 పర్సంటైల్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రణధీర్.. తల్లిదండ్రులు రాజు, ప్రశాంతిల కష్టాన్ని గుర్తిస్తూ చదువులో రాణించాడు. ప్రాథమిక విద్యను రాజాం, విశాఖల్లో, ఇంటర్‌ను విజయవాడలో పూర్తి చేసిన రణధీర్, గ్రామీణ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడు.

​హర్షాతిరేకాలు

​సాధారణ మధ్యతరగతి, వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఐఐటీల్లో సీట్లే లక్ష్యంగా తదుపరి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు విద్యార్థులు ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments