మూగ జీవాల దాహార్తి తీర్చండి: తాసిల్దార్‌కు రైతు సంఘం వినతి

పాలకొండ వెబ్ న్యూస్: వేసవి దృష్ట్యా చెరువుల్లో నీరు నింపి మూగజీవాల దాహార్తి తీర్చాలని కోరుతూ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు, అభ్యుదయ రైతు కండపు ప్రసాదరావు శనివారం తాసిల్దార్ రాధాకృష్ణ మూర్తికి వినతిపత్రం అందజేశారు. తోటపల్లి పరిధిలోని 7, 8 బ్రాంచ్ కాలువల కింద ఉన్న వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదని, చెరువులు ఎండిపోవడంతో పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు చెరువుల్లో నీరు లేకపోవడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా దర్శనం చెరువు పూర్తిగా బీడుగా మారిందని, వెంటనే నీరు నింపకపోతే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తాసిల్దార్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. ఈనెల 8వ తేదీన ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాలు, రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దావల రమణారావు, ఎద్దు బోయిన సింహాద్రి, బోనుమంతు సోమశేఖర్, కరణం అప్పారావు, గార వెంకటరమణ, కే రాము పాల్గొన్నారు.

Post a Comment

0 Comments