పాలకొండ వెబ్ న్యూస్, 23 ఏప్రిల్, 2026:బ్యాంకులో ఉన్న ప్రజల డిపాజిట్లతోనే బ్యాంకులు నడుస్తున్నాయని, అయితే బంగారు ఆభరణాల రుణాలపై ఆర్‌బీఐ నిబంధనలు విధించడం దుర్మార్గపు చర్యని ఉన్నత పర్వత శ్రేణీ విభాగం వ్యవసాయ విస్తరణ పరిశోధనా సలహా మండలి సభ్యులు ఖండాపు ప్రసాదరావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎంత బంగారం కుదవ పెట్టినా కేవలం 2.20 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామనడం, అంతకు మించి కావాలంటే ఆదాయ వివరాలు, రుణ చెల్లింపు సామర్థ్యంపై డిక్లరేషన్ అడగడం సబబు కాదన్నారు. వాణిజ్య బ్యాంకుల ఆంక్షల వల్ల రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ సంస్థలకు హామీ లేకుండా కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చి మాఫీ చేస్తున్న బ్యాంకులు, దేశానికి ఆహార భద్రత కల్పించే రైతుపై ఆంక్షలు విధించడం అన్యాయమన్నారు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో పావలా వడ్డీకే 3 లక్షల వరకు రుణాలు అందేవని, నేడు పెట్టుబడులు పెరిగినా రుణ పరిమితి పెంచకపోవడం దారుణమన్నారు. గిట్టుబాటు ధర లేక, కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేక రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారని హెచ్చరించారు. వ్యవసాయాన్ని అశ్రద్ధ చేస్తే దేశ ఆహార వ్యవస్థ దెబ్బతింటుందన్న నెహ్రూ ఆశయాలను గుర్తు చేస్తూ, వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని ప్రసాదరావు కోరారు.
news by: BSS Prasad
0 Comments