రామతీర్థం ఆలయం నుండి ఉదయం 6.30 గంటలకు విగ్రహాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. తప్పెటగుళ్లు, చెక్క భజనలు మరియు కోలాటాలతో భక్త బృందం నడుమ ఈ యాత్ర సీతారాముని పేట జంక్షన్ మీదుగా నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ వరకు కొనసాగుతుంది. భక్తుల సందర్శనార్థం నెల్లిమర్ల జంక్షన్ వద్ద 15 నిమిషాల పాటు విగ్రహాలను నిలుపుదల చేస్తారు. అక్కడ నుండి విజయనగరం చేరుకోగానే పైడితల్లమ్మ ఆలయం వద్ద ఆలయ అధికారులు విగ్రహాలకు వీడ్కోలు పలుకుతారు. అనంతరం ఈ యాత్ర జాతీయ రహదారి మీదుగా శొంట్యాం జంక్షన్ కు చేరుకుంటుంది. మార్గమధ్యలో సింహాచలం వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయం, అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం మరియు పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానాల ప్రతినిధులు విగ్రహాలకు ఘనంగా వీడ్కోలు సమర్పిస్తారు.
మధ్యాహ్నం 2.45 గంటలకు పిఠాపురం నుండి బయలుదేరి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం మీదుగా సాయంత్రం 3.45 గంటలకు కోటిపల్లి గ్రామానికి విగ్రహాలు చేరుకుంటాయి. అక్కడ భిన్నమైన విగ్రహాలకు శాంతి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం సాయంత్రం 4.48 గంటలకు గోదావరి నదిలో విగ్రహాలను జలాధివాసం చేయనున్నట్లు రామతీర్థం ఉప ప్రధాన అర్చకులు ఖండవిల్లి వేంకట సాయిరామాచార్యులు తెలియజేశారు.
news by: BSS Prasad
0 Comments