ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటింటి ఓటర్ల సర్వే ప్రారంభం..సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా అధికారికంగా విడుదల

(పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 15-06-2026)
     ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియలో కీలక ఘట్టం నేటి నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఓటర్ల సర్వేకు శ్రీకారం చుట్టిన ఎన్నికల యంత్రాంగం, జూలై 14 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బూత్ స్థాయి అధికారులు (BLOలు) నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, తిరిగి సేకరించనున్నారు.
    ఈ ప్రత్యేక సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా 46,397 మంది BLOలు విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి ఇంటికి మూడు సార్లు వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఓటర్లకు రెండు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారు. వాటిలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నంబర్, చిరునామా వంటి పాత వివరాలు ముద్రించి ఉంటాయి. మిగిలిన వివరాలను ఓటర్లు స్వయంగా నమోదు చేయాల్సి ఉంటుంది. రెండు ఫారాలలో ఒకదానిపై BLO సంతకం చేసి రసీదుగా ఓటరుకు అందజేస్తారు. ఆ రసీదును భద్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జూలై 14లోపు నింపిన ఫారాలను BLOలకు తిరిగి అందజేయాల్సి ఉంటుంది. ఫారాలు సమర్పించని వారి పేర్లు జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఓటరు స్థానికంగా అందుబాటులో లేకపోతే, కుటుంబ సభ్యులు లేదా ఇంటి పెద్దలు వారి తరపున వివరాలు నమోదు చేసి సంతకం చేసి సమర్పించవచ్చు.

ఈసారి సర్వేను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ప్రస్తుతం ఉన్న జాబితాతో అనుసంధానం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు ముద్రించగా, ప్రస్తుతం ఉన్న 4,16,18,359 మంది ఓటర్లలో ఇప్పటికే 2,68,86,239 మందికి, అంటే 64.6 శాతం మందికి 2002 జాబితాతో మ్యాపింగ్ పూర్తయింది. మిగిలిన 1,47,32,120 మంది ఓటర్ల వివరాల మ్యాపింగ్ ఇంకా జరగాల్సి ఉంది.

2002 ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారు ఆ వివరాలను ఫారంలో నమోదు చేయాలి. అప్పట్లో పేరు లేకపోయిన వారు తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, ఇతర కుటుంబ సభ్యుల వివరాలతో పాటు పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తాజా కలర్ ఫోటో జత చేసి BLOకు అందజేయాల్సి ఉంటుంది.

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ చేపడతారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫాం-6, చిరునామా మార్పులకు ఫాం-8, మృతులు లేదా అనర్హుల పేర్ల తొలగింపునకు ఫాం-7 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబరు 18 నాటికి అన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా అధికారికంగా విడుదల కానుంది.
    సరైన క్షేత్రస్థాయి విచారణ నిర్వహించకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎవరి పేరునూ ఓటర్ల జాబితా నుంచి తొలగించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈఆర్ఓ నిర్ణయాలపై అభ్యంతరాలు ఉన్నవారు 15 రోజులలోపు జిల్లా మేజిస్ట్రేట్‌కు, 30 రోజులలోపు సీఈఓకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. ఓటర్ల సౌకర్యార్థం 2002 మరియు ప్రస్తుత ఓటర్ల జాబితాలను 'సీఈఓ ఆంధ్ర' వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments