మున్సిపల్ సేవల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాలకొండలో సమ్మె, ర్యాలీ

పాలకొండ వెబ్ న్యూస్, తేదీ: 22.06.2026 మున్సిపల్ సేవలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన 975, 673 జీవోలను ఉపసంహరించుకోవాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పాలకొండలో మున్సిపల్ కార్మికులు సమ్మె, నిరసన ర్యాలీ నిర్వహించారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వంటి 14 సేవల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్యాలయం నుండి పురవీధుల వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ధావాల రమణారావు మాట్లాడుతూ, మున్సిపల్ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి ప్రజల నుండి యూజర్ చార్జీలు వసూలు చేయాలని చూడడం దుర్మార్గమన్నారు. గతంలో తెచ్చిన 279 జీవో తరహాలోనే ఇప్పుడు జీవో నెంబర్లు మార్చి అమలు చేస్తున్నారని, ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకోకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిహెచ్ సురేష్, సిహెచ్ సంజీవి, పి వేణు, సిహెచ్ రఘు, వై హరిబాబు, బి విస్సు పాల్గొన్నారు. శాసనసభ్యులకు మెమోరాండం అందించే  సమయంలో  తెదేపా సీనియర్ నాయకులు  కర్నేన అప్పలనాయుడు, మాజీ ఏఎంసి చైర్మన్ కృష్ణమూర్తి ఉన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments