ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 22, 2026: ఖరీఫ్ సీజన్ లో ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్న ప్రైవేట్ వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని, రైతులకు కావలసిన ఎరువులను ఆర్ఎస్కే ద్వారానే సకాలంలో అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ఇన్చార్జి జేసి కే హేమలత మరియు పాలకొండ సబ్ కలెక్టర్ కు రైతు సంఘం విజ్ఞాపన పత్రం అందించింది. ప్రైవేట్ వ్యాపారులు 1350 రూపాయల డీఏపీ బస్తాను 2250 రూపాయలకు, 268 రూపాయల యూరియా బస్తాను 1000 రూపాయలకు అమ్ముతూ దోపిడీ చేస్తున్నారని సంఘం ఆరోపించింది. సాంకేతిక నిబంధనలతో సంబంధం లేకుండా పాత పద్ధతిలోనే ఎరువులను సరఫరా చేయాలని కోరింది. అలాగే తోటపల్లి బ్యారేజ్ పాత కాలువల షట్టర్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసి సాగునీరు అందించాలని, విత్తనాలు, ఎరువులు, సాగునీటి అంశాలపై జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, అధ్యక్షుడు వెలమల సత్యనారాయణ, బుడితి శంకర్రావు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments