పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామంలోని నాగావళి నదీ తీరాన నూతనంగా నిర్మించిన అన్నపూర్ణ సమేత అమర నాగ లింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి.
ద్వాపర యుగాంతంలో బలరామునిచే కపోత మల్లేశ్వర స్వామి, గుప్తేశ్వర స్వామి, సంఘమేశ్వర స్వామి, ఉమారుద్రకోటేశ్వర స్వామి, మణి నాగేశ్వర స్వామిగా పంచలింగ క్షేత్రాలు ప్రతిష్ఠించబడి పూజలందుకొనుచూ ఉండగా, ప్రస్తుత కలియుగంలో ఆయుఃకారకుడైన సర్వేశ్వరుడు లింగరూప ధారుడై భక్తుల నవీన ఆలయంలో కొలువుదీరడం ఈ క్షేత్ర విశిష్టతగా భావించబడుతోంది. ఇటువంటి మహిమాన్విత పుణ్యక్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవడం భక్తులకు లభించిన అరుదైన భాగ్యంగా నిలిచింది.
త్రిరాత్రి దీక్షా ప్రతిష్ఠా మహోత్సవాలు ఆలయ నిర్మాణ ప్రతిష్ఠ కమిటీ పర్యవేక్షణలో, గ్రామ పురోహితులు హరిశ్చంద్ర పాడి (బుజ్జిబాబు) బ్రహ్మత్వంలో, యాగాచార్యులు జోశ్యుల కూర్మనాధ శర్మ ఆధ్వర్యంలో, వారి కుమారులు వేంకటదుర్గ రంగ ఆంజనేయ శర్మ (అంజిబాబు) ఆచార్యత్వంలో నిష్ణాతులైన ఋత్విక మండలిచే శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి.
జూన్ 22న మంగళ వాయిద్యాలు, భజనల నడుమ విగ్రహాల శోభాయాత్ర, అగ్నిప్రతిష్ఠలు, జలాధివాస క్రతువులతో మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం జూన్ 23, 24 తేదీలలో వేదపారాయణాలు, చండీయాగం, మహారుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, రుద్రహోమం, క్షీరాధివాసం, కుంకుమార్చనలు, ధాన్యాధివాస హోమాలు అత్యంత నియమనిష్ఠలతో నిర్వహించబడ్డాయి.
మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ప్రతిష్ఠా కార్యక్రమం గురువారం ఉదయం 7 గంటల 34 నిమిషాలకు స్వాతీ నక్షత్రయుత కర్కాటక లగ్న పుష్కర కాలంలో జరిగింది. యంత్ర, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ, తులసీవన ప్రతిష్ఠలు అఖండ వైభవంగా నిర్వహించబడ్డాయి.
ప్రతిష్ఠా కార్యక్రమం అనంతరం స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభమవగా, వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పుణ్యఫలాన్ని పొందారు.
మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో సామూహిక భోజనాలతో మహా నారాయణ సేవ ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో పోలీసుల బందోబస్తు మధ్య కార్యక్రమాలు సజావుగా నిర్వహించబడ్డాయి.
News By: BSS ప్రసాద్
పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: www.palakondawebnews.in
0 Comments