నూతన వరి వంగడాల పరిశీలన

పాలకొండ వెబ్ న్యూస్, 28 జూన్, 2026: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాగోలు పరిశోధనా స్థానం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం రస్తకుంటుబాయి శాస్త్రవేత్త డా॥ అనంత విహారి, అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావుకు మూడు మిని కిట్‌లు అందించారు. ఎంటీయూ 1262, ఎంటీయూ 1075తో సంకరపరిచిన ఆర్‌జీఎల్ 7038 రకం 140 రోజుల కాలపరిమితితో, ఉల్లికోడు దోమపోటు తట్టుకుంటూ హెక్టారుకు 6.5 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఎంటీయూ 1210, ఎంటీయూ 1224, ఆర్‌పీ బయో 226తో సంకరపరిచిన ఆర్‌జీఎల్ 7045 రకం 135-140 రోజులలో దోమపోటు, ఎండ, మెడ విరుపు తెగుళ్లు తట్టుకుని హెక్టారుకు 6.5 టన్నుల దిగుబడినిచ్చే తెల్లటి మధ్యస్థ సన్న రకం. ఎంటీయూ 1194, ఎంటీయూ 1224తో సంకరపరిచిన ఆర్‌జీఎల్ 7062 రకం ఖరీఫ్‌లో 135-140 రోజులు, రబీలో 125 రోజులలో చీడపీడలు తట్టుకుని హెక్టారుకు 6.5 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకాల నారుపోసిన, నాటు వేసిన తేదీలు, కాలపరిమితి, దిగుబడి, దుబ్బులో వెన్నులు, గింజల సంఖ్య, చీడపీడల తట్టుకునే శక్తిని రికార్డు చేశారు. తన 58 సంవత్సరాలలో 120 వరి వంగడాలను పరిశీలించి శాస్త్రవేత్తలకు అభిప్రాయం తెలిపానని ప్రసాదరావు పేర్కొన్నారు.

news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments