పాలకొండ వెబ్ న్యూస్, 28 జులై 2026:ఎల్‌నినో ప్రభావం మరియు వర్షాభావం కారణంగా ఎండిపోతున్న ఆకుమళ్లను, ఎదచేలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పాలకొండ మండలం లుంబూరు గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లుంబూరు మాజీ సర్పంచ్ వాసుదేవరావు, గుడివాడ నీటి సంఘం డైరెక్టర్ సంఘం నాయుడు, మొయ్య ఈశ్వరరావు తదితర రైతులు మాట్లాడుతూ, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఈ విషయమై స్థానిక జలవనరుల శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న పంటలకు తక్షణమే సాగునీరు అందించి కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు.
తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని హుస్సేన్ పురం వద్ద 7, 8 బ్రాంచీల ఆయకట్టు భూములకు నీరందాలంటే కనీసం మూడున్నర అడుగుల మేర నీరు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు నుండి రెండున్నర అడుగులకు మించి రావడం లేదని ఆయన తెలిపారు. స్థానిక పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ తక్షణమే జలవనరుల శాఖ, తోటపల్లి ప్రాజెక్ట్ కమిటీతో సమావేశం ఏర్పాటు చేసి, కాలువ చివరి ప్రాంతాలైన పాలకొండ, వీరఘట్టం మండలాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పొలాలను పరిశీలించిన వారిలో రైతు చోడరపు సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
0 Comments