దేవీ భాగవతం ప్రకారం లోకంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడి, ప్రాణికోటి నీరు మరియు ఆహారం లేక అల్లాడుతున్న సమయంలో భక్తుల ప్రార్థనలు ఆలకించిన జగన్మాత శాకంబరీ దేవిగా అవతరించింది. తన దివ్య నేత్రాల నుండి కురిపించిన కన్నీటితో నదులను నింపడమే కాకుండా, తన శరీరం నుండి ఉద్భవించిన ఆకుకూరలు, కూరగాయలతో సమస్త జీవరాశి ఆకలి తీర్చి కాపాడిన కరుణామయి ఈ అమ్మవారు. ఆషాఢ పర్వదినాలలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించడం వెనుక లోక కల్యాణం ఉంది. ప్రకృతి ప్రకోపాలు తగ్గాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, లోకమంతా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహిస్తారు. ప్రకృతిమాతగా దర్శనమిచ్చిన అన్నపూర్ణాదేవిని దర్శించుకోవడం వల్ల కరువు దారిద్ర్యాలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు గట్టిగా నమ్ముతారు.
0 Comments