సంకిలి షుగర్ ఫ్యాక్టరీ మూసివేత ప్రకటనను ఉపసంహరించుకోవాలి: చెరకు రైతుల సంఘం డిమాండ్

పాలకొండ వెబ్ న్యూస్..20 సెప్టెంబరు 2026:​సంకిలి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చేసిన మూసివేత ప్రకటనను ఉపసంహరించుకునే వరకు ఉద్యమం ఆగదని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు స్పష్టం చేశారు. అంపిలి గ్రామంలో మాజీ సర్పంచ్ విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావం పేరుతో 2027-28 క్రషింగ్ సీజన్‌లో ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం చేసిన ప్రకటన వాస్తవ విరుద్ధమని విమర్శించారు. ఫ్యాక్టరీ మూతపడితే వేలాది చెరకు రైతులు, వ్యవసాయ కూలీలు, లారీ, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్ల జీవనాధారం దెబ్బతింటుందని, ఉత్తరాంధ్రలోని ఏకైక ఫ్యాక్టరీని పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. పక్క రాష్ట్రాల తరహాలో చెరకు రైతులకు మద్దతు ధర ప్రకటించి పరిశ్రమను, రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

​యాజమాన్యం ప్రకటనకు నిరసనగా ఈనెల 28న సంకిలి నాగవళి నది ఒడ్డున ఉన్న శివాలయం నుంచి ఉదయం 10 గంటలకు నిర్వహించే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పాలకొండ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చింత సంఘం నాయుడు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా సబ్సిడీలు, ఎరువులు, విత్తనాలు, సిబ్బంది ప్రోత్సాహకాలు తగ్గించడం వల్లే చెరకు సాగు తగ్గిందని, తిరిగి ఆ ప్రోత్సాహకాలు కొనసాగిస్తే సరిపడా చెరకును అందించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్ట రమణ, బూరాడ సత్యం నాయుడు, జడ్డు నాగరాజు, వాకమూడి కిరణ్, గులివిందుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్

Post a Comment

0 Comments