నైపుణ్యంతో జీవామృతం తయారీ: ఆరోగ్యకరమైన పంటల దిశగా ముందడుగు

 పాలకొండ వెబ్ న్యూస్:  పి.ఆర్. రాజుపేట, అక్టోబర్ 23, 2025: రసాయనిక పురుగుమందుల విచ్చలవిడి వాడకం వల్ల మానవాళి ఆరోగ్యం దెబ్బతిని, రోగాల బారిన పడుతున్న తరుణంలో, ప్రకృతి వ్యవసాయంపై రైతులను ప్రోత్సహించే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు, నీటి వినియోగాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన పంటలను పండించాలనే లక్ష్యంతో, జీవామృతం, వేప గింజల కషాయం, అగ్ని అస్త్రం వంటి ప్రకృతి సిద్ధమైన ద్రావణాలను వినియోగించాలని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

palakonda web news

ఈ నేపథ్యంలో, ఐసీఆర్‌పీ గేదెల వెంకట నాయుడు, వాలంటీర్ వి. సుశీలలు ఈరోజు అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆధ్వర్యంలో పి.ఆర్. రాజుపేటలోని కూరగాయల తోటలో జీవామృతాన్ని తయారు చేశారు. రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా, భూమిని సారవంతం చేసే ఈ జీవామృతం తయారీ విధానాన్ని వారు వివరించారు.

జీవామృతం తయారీ విధానం (ఎకరానికి కావలసిన మోతాదు):

 * 200 లీటర్ల నీరు

 * 10 కిలోల దేశీ ఆవు పేడ

 * 4 కిలోల బెల్లం

 * 4 కిలోల శనగపిండి

 * గుప్పెడు పుట్ట మట్టి

వీటిని ఒక డ్రమ్ములో పోసి, సవ్య దిశలో ఉదయం, సాయంత్రం బాగా కలిపారు. ఈ ద్రావణాన్ని నీడ ప్రదేశంలో ఉంచి, గోనెసంచెతో కప్పి ఉంచడం ద్వారా కేవలం 48 గంటల్లోనే జీవామృతం తయారవుతుందని తెలిపారు.

ఈ జీవామృతంలో మైక్రో ఆర్గానిజమ్స్ (సూక్ష్మజీవులు) విస్తారంగా ఉండి, భూమిని సారవంతం చేయడానికి, పంటలకు పోషకాలను అందించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపారు. వారం లోపు పంటలకు ఈ జీవామృతాన్ని అందిస్తే మంచి ఫలితం ఉంటుందని, దీని ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన పంటలను అందించవచ్చని రైతు కండ ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడగలరని ఈ సందర్భంగా తెలియజేశారు.


Post a Comment

0 Comments