​ భక్తిభావంతో పాలకొండ లో నాగుల చవితి వేడుకలు

నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక వార్త కార్తీక మాసం శుద్ధ చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని, పాలకొండ వాసులు ఆనందోత్సాహాల మధ్య నాగుల చవితి పూజలను ఘనంగా నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ, పట్టణంలో కాలనీలోని చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పుట్ట వద్దకు వెళ్లి నాగరాజుకు ప్రత్యేక పూజలు చేశారు.మన పెద్దలు ప్రతీ నిత్యం తమ పరిసరాలలో సంచరించే నాగరాజుకు ఏడాదికి ఒక్కసారి నమస్కరించే గొప్ప సంప్రదాయాన్ని పెట్టారని, దానిని తాము తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నామని కాలనీ వాసులు తెలిపారు.
​గ్రామీణ ప్రాంతాల సంప్రదాయాన్ని అనుసరించి, బంధువులు, రక్త సంబంధీకులు అందరూ ఏకమై, తమ కాలనీలోని పుట్ట వద్దకు చేరుకున్నారు.​అందరూ కలిసి పుట్టను వెతికి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ​నాగరాజు తమ జోలికి రాకుండా, తమను మరియు తమ పరిసరాలను సుఖశాంతులతో కాపాడాలని వేడుకున్నారు.​పుట్టలో పాలు, చలిమిడి, చిమ్మిలి వంటి నైవేద్యాలను సమర్పించారు.ఈ సందర్భంగా నాగుల చవితి సందర్భంగా పుట్ట వద్దకు వచ్చిన భక్తులు మాట్లాడుతూ, ఈ రకంగా అందరూ కలిసి ఒకే చోట ఏకమై పండుగ జరుపుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని మరియు ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలియ జేశారు. "ప్రతీ ఏడాది ఇలాగే అందరం కలిసి వెళ్లే భాగ్యం కలిగించాలని పైన ఉన్న భగవంతుడిని, కిందనున్న నాగరాజును వేడుకున్నాం" అని వారు సంతోషం వ్యక్తం చేశారు. 'ఓం నమశివాయః', 'ఓం నాగరాజాయనమః' అంటూ భక్తి పారవశ్యంతో మమేకమైన పాలకొండ పట్టణవాసులు నాగుల చవితి వేడుకను భక్తిభావంతో ముగించారు.
News by: Vavilapalli Govinda Rao Teacher (Retd)

Post a Comment

0 Comments