టెట్ పరీక్షపై ఉపాధ్యాయుల ఆవేదన

పాలకొండ వెబ్ న్యూస్ News by  BSS Prasad: 
పార్వతీపురం, అక్టోబర్ 25 : ప్రస్తుతం జరుగుతున్న టెట్ పరీక్షపై ఉపాధ్యాయ వర్గంలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) మరడాన సంపత్ కుమార్ మాట్లాడుతూ, “సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్ష రాయాల్సి రావడం, ఇప్పటికే అనేక బోధనేతర కార్యక్రమాలతో సతమతమవుతున్న ఉపాధ్యాయులపై అదనపు భారం మోపినట్లే” అని అన్నారు.ఇప్పటికే పాఠశాల స్థాయిలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో నిత్యం ఒత్తిడిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఒక పెను సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు. “డీఎస్సీని అవలీలగా ఉత్తీర్ణులై, బోధనలో అనుభవం సంపాదించిన ఉపాధ్యాయులు ఇప్పుడు మరోసారి పరీక్ష రాయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలి” అని సంపత్ కుమార్ సూచించారు. అతను  మాట్లాడుతూ, విద్య హక్కు చట్టాన్ని (RTE Act) సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయడం ఒక మార్గమని, లేదా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం మరో మార్గమని అన్నారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం వారు బోధిస్తున్న పాఠ్యాంశాలపై సరళమైన ప్రత్యేక పరీక్ష రూపొందించి అమలు చేయడం కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గమని సూచించారు. ఈ అంశంపై రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించి, ఉపాధ్యాయులపై ఉన్న ఒత్తిడిని తగ్గించే చర్యలు చేపట్టాలని, అవసరమైతే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన విన్నవించారు.“ఉద్యోగంలో 25–30 సంవత్సరాలు పూర్తి చేసిన ఉపాధ్యాయులు మళ్లీ పరీక్ష రాయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాను” అని సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments