ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం – విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపుదలపై అవగాహన

పాలకొండ వెబ్ న్యూస్, అక్టోబర్ 10: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాలకొండ ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రసంగించిన నిపుణులు మాట్లాడుతూ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షల పట్ల భయం, ఒత్తిడి, ఒంటరితనం వంటి భావనలకు లోనుకావొద్దని సూచించారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్‌ను ధైర్యంగా ఎదుర్కోవాలని, అనవసరమైన ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదని పిలుపునిచ్చారు. చెడు వ్యసనాలు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, వాటికి బానిస కాకుండా సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలని విద్యార్థులకు వివరించారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారు టోల్ ఫ్రీ నంబర్ 14 416 కు సంప్రదించవచ్చని వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు, ఏరియా ఆసుపత్రి ఏజీఎంఓ ఇన్‌చార్జ్ పైల శంకరరావు, సీనియర్ అధ్యాపకులు గేదెల గోవిందరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, ఆత్మవిశ్వాసం, ఒత్తిడి నియంత్రణ పద్ధతులపై అవగాహన పొందారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు నిపుణులతో పరస్పర చర్చల్లో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. News by: BSS Prasad


Post a Comment

0 Comments