పాలకొండ వెబ్ న్యూస్, అక్టోబర్ 17, 2025: మీడియా సంస్థలు, వాటి ప్రతినిధులపై ప్రభుత్వ మరియు పోలీసుల కక్షపూరిత చర్యలను పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు శుక్రవారం (17.10.2025) నాడు మండల తహశీల్దార్ రాధాకృష్ణ మూర్తి కి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రజా గొంతుకై సామాన్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే క్రమంలో కీలకంగా వ్యవహరిస్తున్న మీడియాను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికే హానికరమని ప్రెస్ క్లబ్ సభ్యులు తమ వినతిలో పేర్కొన్నారు. 'సాక్షి'పై కక్ష సాధింపు హేయమైన చర్య అని వినతి పత్రం లో పేర్కొన్నారు.
ముఖ్యంగా, హైదరాబాద్, విజయవాడలలో గల 'సాక్షి' కార్యాలయాలపై దాడులు, ఎడిటోరియల్ ఇంచార్జ్ ఆర్. ధనుంజయ రెడ్డితో పాటు, రాష్ట్రంలో కల్తీ మద్యంపై వాస్తవ కథనాలు రాస్తున్న పలు జిల్లాల బ్యూరో ఇన్చార్జిలు, విలేకరులపై అక్రమ కేసులు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం, తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టడం వంటి ఘటనలను ప్రెస్ క్లబ్ తీవ్రంగా నిరసించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని, మీడియా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నాలను మీడియా లోకం ఖండిస్తుందని పాలకొండ ప్రెస్ క్లబ్ సభ్యులు స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పాత్రికేయులపై కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

0 Comments