పాలకొండలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపుతో కోటి సంతకాల సేకరణ: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

పాలకొండ, (అక్టోబర్ 23, 2025):
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పాలకొండ పట్టణంలో ఉధృతంగా కొనసాగింది. పాలకొండ పట్టణ అధ్యక్షులు వెలమల మన్మథరావు ఆధ్వర్యంలో స్థానిక నగర పంచాయతీ పరిధిలోని 11, 12, 13, 18 వార్డులలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేసి, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. పేద ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిన వై.ఎస్.ఆర్. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని వారు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పట్టణ అధ్యక్షులు వెలమల మన్మథరావు, జగనన్న ప్రభుత్వం ఒక్కొక్కటి 50 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన మెడికల్ కాలేజీలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చి ప్రైవేటు పరం చేయడం పేద ప్రజల, విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని ఆయన విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దుప్పాడ పాపినాయుడు, కడగల వెంకటరమణ, కిల్లారి మోహన్, కోడెం బాబీ, తూముల లక్ష్మణ, పల్లా భాను, బాసూరు కాంతా రావు, నీలపు శ్రీనుతో పాటు కో ఆప్షన్ సభ్యులు, కొండదాడి విజయకుమార్, దుంపల రమేష్ చిన్ని, టేకి రామకృష్ణ, గెద్ద చిన్నం నాయుడు, దాసరి నాగేశ్వరరావు, తుమ్మగుంట జగదీష్, గొన్నభక్తుల కృష్ణారావు మరియు వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా పేదలకు వైద్య విద్యను, వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments