పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ పట్టణానికి చెందిన యువ వైద్యుడు డాక్టర్ కొట్టిశ వరుణ్ సాయి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రవేశ పరీక్షలో తన ప్రతిభను చాటారు. ఈ నెల నవంబర్ 9న విశాఖపట్నంలో జరిగిన ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో ఆయన జాతీయస్థాయిలో 1380వ ర్యాంకు సాధించి, తన ప్రతిభను నిరూపించుకున్నారు. వరుణ్ సాయి 2025 సంవత్సరంలో శ్రీకాకుళం రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వైద్య నిపుణుడిగా పీజీ చేయాలన్న తన కలను జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించడం ద్వారా సాకారం చేసుకున్నారు. ఆయన విజయం వెనుక తల్లిదండ్రుల అపారమైన కృషి ఉంది. తండ్రి కొట్టిశ రాజశేఖర్ పాలకొండలో మెడికల్ స్టోర్ నిర్వహిస్తూ, తన కుమారుడిని చిన్నతనం నుంచే కష్టపడి చదివించి, వైద్య నిపుణుడిగా చూడాలని కలలు కన్నారు. తల్లి సత్యవతి నగర పంచాయతీ మెప్మా విభాగంలో పనిచేస్తూ వరుణ్ సాయికి అండగా నిలిచారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వరుణ్ సాయిని పూర్వపు 13వ వార్డు కౌన్సిలర్ భాసూరు సరస్వతమ్మతో పాటు పలువురు ప్రముఖులు మరియు స్థానిక ప్రజలు ఘనంగా అభినందించారు. పాలకొండ పట్టణానికి గర్వకారణంగా నిలిచిన డాక్టర్ వరుణ్ సాయి కృషి నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఈ మేరకు 1988-91 పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు చెందిన గ్రాడ్యుయేట్స్ కౌన్సిల్ సభ్యులు ఐ ఆదినారాయణ వై విశ్వేశ్వరరావు జి లలిత ఆర్ ఎం ఎన్ శాంతి సునీల్ రాజ్ కుమార్ బృందా విజయ ప్రసాద్ జి అప్పలనాయుడు నాగభూషణ్ తదితరులు వరుణ్ సాయి కి అభినందనలు తెలిపారు.
0 Comments