మొంథా' తుపాను: కౌలు రైతు వెన్ను విరిచిన ప్రకృతి ప్రకోపం పంట నష్టంపై ప్రభుత్వ లెక్కల్లో తేడా... పరిహారం పెంపు, కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్‌

 

palakonda montha cyclone crop damage

పాలకొండ వెబ్ న్యూస్ : ఇటీవల రాష్ట్రంలో సంభవించిన 'మొంథా' తుపాను ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించినప్పటికీ, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కౌలు రైతుల వెన్ను విరిచింది. ప్రాథమిక అంచనాల ప్రకారం, తుపాను వల్ల సుమారు 19 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 5 లక్షల మందికి పైగా రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వరి, పత్తి, మినుము, బొప్పాయి, ఆక్వా, ఉల్లి, పూల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తం పంట నష్టంలో 70 శాతం వరి పంటదే. వరి గింజ గట్టిపడే దశలో సుంకు రాలిపోవడంతో, పైరు పచ్చగా ఉన్నా గింజలు తాలుగా మారే పరిస్థితి ఏర్పడింది.

💰 లక్షల్లో పెట్టుబడి, సున్నా రాబడి: వరి సాగు చేసిన వారిలో 80 శాతం మంది కౌలు రైతులే. వీరు ఎకరానికి రూ. 30 వేల వరకు కౌలు చెల్లించి, మరో రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అరటి, మిర్చి, పసుపు వంటి వాణిజ్య పంటలకు ఎకరానికి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చు అవుతోంది. ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో నేలపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తుపాను కారణంగా పడిపోయిన పంటను ఇంటికి చేర్చుకోవడానికి అదనంగా రూ. 10 వేల నుండి రూ. 20 వేల వరకు ఖర్చులు పెరిగాయని రైతులు వాపోతున్నారు.

📢 పరిహారం పెంపు, కౌలు రైతుల సమస్య : గత కమిషన్ల (స్వామినాథన్, హుడా) సిఫారసుల మేరకు పెరిగిన పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని నష్ట పరిహారాన్ని పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వరికి ఎకరానికి రూ.25 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం మొదట 19 లక్షల ఎకరాల నష్టం అంచనా వేసినా, ఎన్యూమరేషన్ (Enumaration) లెక్కలు 3 లక్షల ఎకరాల చుట్టూ మాత్రమే ఉన్నాయని రైతులు విమర్శిస్తున్నారు. భూ యజమాని సంతకం లేకపోవడం, సీసీఆర్ కార్డులు (Cultivator Certificate/Record) లేకపోవడం వల్ల కౌలు రైతులకు పంట రుణాలు, నష్టపరిహారం అందడం లేదు.

Post a Comment

0 Comments