న్యూఢిల్లీ: ప్రస్తుతం
12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న ఓటర్
జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను నాశనం చేయడానికి
ఎన్నికల కమిషన్ (ఈసీ) కుటిల పన్నాగం పన్నిందని మంగళవారం కాంగ్రెస్ విమర్శించింది.
దీనికి వ్యతిరేకంగా డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో భారీ
ర్యాలీ నిర్వహించనున్నట్లు
ప్రకటించింది. మంగళవారం పార్టీ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన
కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ సమక్షంలో ఎస్‌ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాల పీసీసీ
అధ్యక్షులు, ఇన్‌ఛార్జీలతో
సమావేశం జరిగింది.
📜 ఈసీ
బాధ్యతల నుంచి తప్పుకుంది : ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే
మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ను
బీజేపీ తన ఓటు చోరీకి ఆయుధంగా వాడుకుంటోందని విమర్శించారు. ఈసీ తన
బాధ్యతలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే మౌనంగా ఉండకూడదని శ్రేణులకు దిశానిర్దేశం
చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ,
"న్యాయమైన, పారదర్శక ఓటర్ల జాబితాను అందించాల్సిన
బాధ్యత నుంచి ఎన్నికల కమిషన్ తప్పుకుంది," అని ఆరోపించారు. ఈ సమస్యను రాజకీయంగా,
చట్టపరంగా, సంస్థాగతంగా ఎదుర్కోవాలని
పిలుపునిచ్చారు.
💥 ఉద్దేశపూర్వకంగా
ఓట్ల తొలగింపు : కె.సి. వేణుగోపాల్ మాట్లాడుతూ, ఒక వర్గం ఓట్లను తొలగించడానికే ఈసీ
ఉద్దేశపూర్వకంగా ఎస్‌ఐఆర్‌ను రూపొందించిందని, ఇది దుర్మార్గపు
ప్రయత్నమని, అనైతికమని, అప్రజాస్వామికమని మండిపడ్డారు. బీహార్‌లో ఇదే అనుభవం
ఎదురైందని గుర్తు చేశారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఈ
నెల 4 నుంచి చత్తీస్‌గఢ్,
గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో కొనసాగుతోంది. తమిళనాడు,
పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ
ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీపై కాంగ్రెస్ ఆరోపణలు ప్రాధాన్యత
సంతరించుకున్నాయి.
NEWS BY : T. SIMHACHALAM, SENIOR ADVOCATE, MEMBER, EDITORIAL BOARD.

0 Comments