ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న 'ఉచిత బస్సు' రద్దీ: పాలకొండ బస్ స్టేషన్‌లో ఆర్టీసీపై పెరుగుతున్న ఒత్తిడి

పాలకొండ వెబ్ న్యూస్: పార్వతీపురం మన్యం జిల్లా (పాలకొండ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం 'స్త్రీ శక్తి' మహిళా లోకానికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు తీరు సామాన్య ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ బస్ స్టేషన్ దీనికి నిదర్శనంగా మారింది. రద్దీ అమాంతం పెరిగినప్పటికీ, దానికి అనుగుణంగా కొత్త బస్సులను కేటాయించకపోవడం, ప్రస్తుత బస్సుల సంఖ్యను పెంచకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం హర్షణీయమే అయినప్పటికీ, ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత బస్సుల సంఖ్య పెరగకపోవడం వల్ల రద్దీ అమాంతం పెరిగిపోయిందని, దీని వలన నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా, ఉదయం 9:15 గంటలకు పాలకొండ బస్ స్టేషన్ నుండి బయలుదేరే బస్సు, రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఎక్కకముందే కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఆగి వెంటనే బయలుదేరిపోవడం గమనార్హం. దీంతో ఫ్రస్టేషన్లో బస్సు కోసం మిగిలి ఉన్న  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, పురుష ప్రయాణికుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. టికెట్ కోసం డబ్బు చెల్లించి కూడా బస్సులలో కనీసం నిలబడటానికి కూడా చోటు లేకపోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు పథకానికి ముందు ఇటువంటి రద్దీ సమస్యలు చాలా తక్కువగా ఉండేవని, ఇప్పుడు రద్దీ రెట్టింపు కావడంతో పురుష ప్రయాణికులు నిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, డబ్బు కట్టినా సీటు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన ఆవశ్యకత ఉందని ప్రయాణికులు ప్రభుత్వాన్ని, రవాణా శాఖను కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖ (ఏపీఎస్‌ఆర్టీసీ), పాలకొండ డిపో అధికారులు తక్షణమే స్పందించి, పెరుగుతున్న ప్రజల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని వారు కోరుచున్నారు. తద్వారా రద్దీని తగ్గించి, సామాన్య ప్రయాణికులకు ముఖ్యంగా డబ్బు చెల్లించి టికెట్ కొనుగోలు చేసే పురుషులకు సైతం సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించాలని పాలకొండ బస్ స్టేషన్ ప్రయాణికులు వేడుకుంటున్నారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు..

Post a Comment

1 Comments

  1. ఆంద్రప్రదేశ్ లో నివసిస్తున్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సదుద్దేశంతో ఆగష్టు-15 నుండి ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకం బాగానే ఉన్నప్పటికీ, ఉద్యోగ రీత్యా వేరే వేరే ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ప్రయాణీకులు నానా అవస్తలు పడుతున్నారు. ఏదో కష్టపడి బస్సు ఎక్కిన తర్వాత సీటు దొరక్క నిల్చోని ప్రయాణం చేయడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందువలన ఉదయం 8గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు అదనంగా బస్సులు నడపాలని కోరుతున్నాము రానున్న రెండు నెలలు ముఖ్యమైన పండగల సీజన్ నుంచి ద్రుష్టిలో ఉంచుకుని ఆవసరమైన మేరకు అదనంగా బస్సులు నడపవలెను.

    ReplyDelete