టెక్కలి; (నవంబర్ 4, మంగళవారం) దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం క్షేత్రంలో ఈ నెల 9న జరగనున్న బాలియాత్రను కులాలకు అతీతంగా అందరూ విజయవంతం చేయాలని విశ్రాంత తహశీల్దార్, టీడీపీ నేత మరియు మానవ హక్కుల సంఘం అధ్యక్షులు పేడాడ జనార్ధనరావు పిలుపునిచ్చారు.
టెక్కలి దరి ఇజ్జవరంలో కాళింగ సంఘం నాయకులు పేడాడ పరమేశ్వర రావుతో మంగళవారం ఆయన మాట్లాడారు. సుమారు 2286 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన కళింగ సామ్రాజ్యం నాటి నుంచే సర్వమానవులు బాలియాత్రను నిర్వహించేవారని వివరించారు. ఈ ప్రాంతంలో కళింగ రాజు నిర్మించిన శ్రీముఖలింగం ఆలయం, పూరి జగన్నాధ ఆలయం, సింహాచలం ఆలయాల కంటే పురాతనమైనదన్న చరిత్రను మర్చిపోవద్దని ఆయన కోరారు.
రాష్ట్ర విభజన వల్ల చారిత్రక కళింగ సీమ విడిపోయి, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రగా మిగిలిపోవడమే కాక, బాలియాత్ర కేవలం కాళింగులకే పరిమితమన్న దుష్ప్రచారం ఊపందుకుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒరిస్సాలో కటక్ కేంద్రంగా బాలియాత్ర కులాలకు అతీతంగా జరుగుతోందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర పుటలకెక్కకుండా పోయిందని అన్నారు.
కార్తీక మాసంలో పూర్వీకుల పవిత్రాత్మలకు శాంతి చేకూరే విధంగా చారిత్రక బాలియాత్రలో స్వయంభూ శివ దర్శనం చేసుకొని, కార్తీక వన భోజనాలు నిర్వహించాలని జనార్ధనరావు విజ్ఞప్తి చేశారు. మహానది నుంచి గోదావరి వరకు ఉన్న కళింగసీమ ప్రజలు ఈనెల 9న శ్రీముఖలింగం యాత్రలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తహశీల్దార్ సనపల రమణారావు, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments