పాలకొండ డివిజన్‌కు న్యాయంపై సీఎం సానుకూలంజిల్లా సాధన సమితికి చంద్రబాబు హామీ!

పాలకొండ వెబ్ న్యూస్: జిల్లాల పునర్విభజనలో అన్యాయానికి గురైన పాలకొండ పాత రెవెన్యూ డివిజన్‌కు న్యాయం చేయాలని, దీనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలని కోరుతూ పాలకొండ జిల్లా సాధన సమితి ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం కలిశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు బుడితి అప్పలనాయుడు ఆదివారం వెల్లడించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అప్పలనాయుడుతో పాటు మాజీ ఎంపీపీ, అరకు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వారాడ సుమంత్ నాయుడు ఉన్నారు. పాలకొండ భౌగోళిక, ఆర్థిక, సామాజిక సంబంధాలు శ్రీకాకుళం జిల్లాతో ముడిపడి ఉన్నాయని, గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందని వారు వివరించారు. ఎన్నికల హామీలో భాగంగా భామిని బహిరంగ సభలో నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలో కలుపుతామని అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
వారి వినతిని పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి, త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని హామీ ఇచ్చారని అప్పలనాయుడు తెలిపారు. ఉపసంఘం సభ్యులైన హోం మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాన సత్యప్రసాద్‌కు సమాచారం అందించామని, శనివారం రాత్రి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కూడా కలిసి పూర్వపరాలను వివరించామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి సాధన సమితి ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి గౌరవ అధ్యక్షుడు కనపాక చౌదరి నాయుడు సహా పలువురు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments