పాలకొండ వెబ్ న్యూస్ (డిసెంబర్ 5, శుక్రవారం):పాలకొండ నియోజకవర్గంలో దశాబ్దాలుగా నిలిచిపోయిన అభివృద్ధి, పరిష్కారం కాని మౌలిక సదుపాయాల సమస్యలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు భామిని మండలంలో నిర్వహించనున్న ‘మెగా పేరెంట్స్ సమావేశం’లో పాల్గొననున్న నేపథ్యంలో, మొత్తం నియోజకవర్గం ఆయన పర్యటనపై ఆశలు పెట్టుకుంది. మాటలు మాత్రమే వినిపించి వాస్తవ అభివృద్ధి మాత్రం కలలోకే పరిమితమైపోయిందనే ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్లు పాలకొండ పరిస్థితి యథాతథంగా కొనసాగుతుండటంపై స్థానికులు తీవ్ర అసంతృప్తిని ప్రకటిస్తున్నారు.
రైతుల ఆధార ప్రాణమైన సాగునీటి వనరులు ఈ ప్రాంతంలో ఇంకా సమస్యలతోనే కొట్టుమిట్టాడు తున్నాయి. తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ పనులు నిలిచిపోయి ఏళ్లుగా చేపట్టకపోవడంతో వ్యవసాయం తీవ్ర ప్రభావం పడుతోంది. ఉమ్మడి రాష్ట్రాల కాలంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1987లో శంకుస్థాపన చేసిన జంపర్ కోట జలాశయం ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం స్థానిక రైతాంగానికి పెద్ద నిరాశగా మారింది. ఇదే విధంగా, భామినిలో కొండ లోవగెడ్డ, భామిని లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఆరంభం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టులు ప్రారంభమై పూర్తయ్యే దాకా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారదనే భావనతో రైతులు సీఎం దృష్టి సారించాలని విన్నవిస్తున్నారు.
తాగునీటి సమస్య మాత్రం ప్రతి సంవత్సరం ప్రజలకు భయంకరంగా మారిపోతోంది. కేంద్ర ప్రభుత్వం 'నాన్ అమృత్'లో భాగంగా పాలకొండ పట్టణానికి రూ.57 కోట్ల మంజూరు జరిగి ఏడు సంవత్సరాలు గడిచినా పనులు ప్రారంభం కాలేదు. పైప్‌లైన్లు పూర్తిగా పాడైపోవడంతో వేసవిలో నీటి కొరత, వర్షాకాలంలో కలుషిత నీరు అనే రెండు విధాలుగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. శివారు ప్రాంతాలు నీటి కోసం చిందులు వేస్తుండగా, పట్టణంలో కూడా రోజువారీ ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
డంపింగ్ యార్డు సమస్య పాలకొండను కొన్నేళ్లుగా గుదిబండలా వెంటాడుతోంది. డివిజన్ కేంద్రంగా ఉన్న పట్టణానికి 18 సంవత్సరాలుగా డంపింగ్ యార్డు లేకపోవడంతో 20 వార్డుల్లో చెత్త కుప్పలు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. స్థల సేకరణలో వచ్చిన అడ్డంకులతో మున్సిపల్ సిబ్బంది చెరువులు, పాఠశాలల ప్రాంగణాలు, గ్రంథాలయాల దగ్గర కూడా చెత్త పారబోసే పరిస్థితి రావడం ప్రజారోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేసింది. పట్టణం అంతా దుర్గంధభరితంగా మారిందని స్థానికులు తీవ్ర అసహనంతో ఉన్నారు.
0 Comments